-గణేష్ నగర్ శ్రీ సిద్ధి వినాయక మండపంలో ఘనంగా పూజా కార్యక్రమం

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-పట్టణంలోని గణేష్ నగర్‌లో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా మండలి ఆధ్వర్యంలో మహిళలతో సామూహిక కుంకుమ పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు. ఉదయం నుంచే స్థానిక మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పెద్ద సంఖ్యలో పూజా మండపానికి చేరుకుని భక్తిభావంతో కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయకుని విగ్రహాన్ని పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు గణపతి నామస్మరణ చేస్తూ సామూహికంగా కుంకుమ పూజలు చేసి, కుటుంబ సభ్యులకు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని స్వామివారిని ప్రార్థించారు. పూజా కార్యక్రమంతో మండపం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.ఈ కార్యక్రమంలో లెల్ల లత, దొంతమల్ల ఉషారాణి, దొంతమల్ల లావణ్య, కోలా లక్ష్మి, వేల్పుల సరిత, వేల్పుల పోషమ్మ, వనపర్తి ప్రశాంతి, పొన్న మౌనిక, ముత్యాల భాగ్యలక్ష్మి, పాక శైలజ, అందుగుల శ్వేత తదితరులు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిన్నారులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందారు. వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మండలి ఆధ్వర్యంలో ప్రతిరోజూ వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేయాలని మండలి సభ్యులు కోరారు.

