హోమ్ టాప్ న్యూస్ పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

పెన్షన్‌ సమస్యపై ఉద్యోగుల ర్యాలీ

0
6

మంచిర్యాల ప్రత్యక్షత:-పెన్షన్‌ వ్యతిరేక దినం సందర్భంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి ఆధ్వర్యంలో కార్యాలయాల ప్రధాన ద్వారం నుంచి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ..2004 సెప్టెంబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన పెన్షన్‌ విధానం ఉద్యోగ, ఉపాధ్యాయుల భవిష్యత్తుకు శాపంగా మారిందని అన్నారు. నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రెండో వేతన సవరణ సంఘాన్ని 51 శాతం పెంపుతో తక్షణమే అమలు చేయాలని, ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలని కోరారు.ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన నూతన ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న రూ.12 వేల కోట్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో ఉద్యోగులకు 17 శాతం ఇంటి అద్దె భత్యం కల్పించాలని కోరారు.ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలపై వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనజా రెడ్డి అన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి జిల్లా నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు, నాయకులు, జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి