
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నల్లబ్యాడ్జీల నిరసన ఏడో రోజూ కొనసాగింది. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ వేతన సవరణ సంఘం సిఫారసులను వెంటనే అమలు చేయాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాలను విడుదల చేయడంతో పాటు ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.12 వేల కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు 17 శాతం ఇంటి అద్దె భత్యం కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర కమిటీ తో సెప్టెంబర్ 10 వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన కొనసాగిస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి కే. రమేష్‌తో పాటు రవికిషోర్, సతీష్, పద్మశ్రీ, వెంకటేష్, మల్లేష్, జనార్దన్, జీనత్, షారుక్, మహేందర్, అరుణ, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

