-పెండింగ్ బిల్లుల పరిష్కారంతో ఉద్యోగుల్లో హర్షం
-ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల తమకున్న చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా సోమవారం మరో రూ.2 వేల కోట్ల బకాయిల విడుదలకు ఆమోదం తెలిపారు.ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీ ప్రకారం, 100 రోజుల్లో రూ.6 వేల కోట్ల బకాయిలను దశలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో గత నెల 29న మొదటి విడతగా రూ.2 వేల కోట్లు విడుదల చేయగా, తాజాగా రెండో విడతగా మరో రూ.2 వేల కోట్లు విడుదల చేసింది.ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన సిబ్బందిలో ఆనందం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగులు, జిల్లా పరిషత్ ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్ బకాయిలను పూర్తిగా చెల్లించి ఖాతాలను క్లియర్ చేసింది. అలాగే సెప్టెంబర్ 2025 వరకు ఉన్న కమ్యూటేషన్ బకాయిలను కూడా చెల్లించినట్లు వెల్లడించింది.ఇక రూ.10 వేల లోపు పెండింగ్ బిల్లులను పరిష్కరించి దాదాపు ఐదు లక్షల టోకెన్లకు చెల్లింపులు చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన బకాయిలను కూడా క్రమపద్ధతిలో విడుదల చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ సందర్భంగా టీఎన్జీవో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గడియారం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర జేఏసీ మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి హుస్సేన్ ముజీబ్ నాయకత్వానికి జిల్లా టీఎన్జీవో తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

