-రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు: రామగుండం సీపీ

మంచిర్యాల ప్రత్యక్షత:-రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నకిలీ పత్తి విత్తనాల అక్రమ వ్యాపారంపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. మంచిర్యాల జిల్లా తాండూర్, భీమారం తదితర ప్రాంతాలకు నకిలీ పత్తి విత్తనాలను సరఫరా చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన వూస సుబ్బారావుపై బుధవారం పీడీ యాక్ట్ చట్టం అమలు చేసినట్లు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా తెలిపారు.నిందితుడు ఏజెంట్ల ద్వారా పలు మండలాల్లో నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. గతంలో కూడా నిందితుడిపై పలు కేసులు నమోదయ్యాయని, పీడీ చట్టం అమలైన తర్వాత కూడా నేరాలకు పాల్పడినట్లు వెల్లడించారు. తాండూర్ సీఐ దేవయ్య, ఎస్‌ఐ ప్రసాద్ నిందితుడికి పీడీ ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. నకిలీ విత్తనాల వ్యాపారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, రైతులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని సీపీ హెచ్చరించారు.


