-జూలై 1న జరిగే ధర్నాని విజయవంతం చేయండి

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-సింగరేణి కార్మికుల 12వ వేతన ఒప్పందం అమలుకు కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 1న కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు రామకృష్ణాపూర్‌లోని యూనియన్ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బ్రాంచ్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ జనరల్ సెక్రటరీ అల్లి రాజేందర్, బ్రాంచ్ అధ్యక్షుడు సాంబారు వెంకటస్వామి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను కారణంగా చూపుతూ కోల్ ఇండియా యాజమాన్యం ఇప్పటివరకు ఏర్పాటు చేయాల్సిన 12వ వేతన ఒప్పంద కమిటీని ఆలస్యం చేయడం సరైనది కాదన్నారు. ఇప్పటికే పలుమార్లు యాజమాన్యానికి విజ్ఞప్తి చేసినా స్పందన లేకపోవడంతో బొగ్గు రంగానికి చెందిన నాలుగు ఫెడరేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు జులై 1 ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు.భారతదేశంలోని ఇతర రంగాల్లో అమలు చేయని లేబర్ కోడ్‌లను కేవలం బొగ్గు రంగంలో మాత్రమే అమలు చేయాలని ప్రయత్నించడం సమంజసం కాదని పేర్కొన్నారు. వేతన ఒప్పంద కమిటీ ఏర్పాటు విషయంలో యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే అన్ని కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాటాల్లో పాల్గొని కార్మిక హక్కుల సాధనకు బలం చేకూర్చాలని కోరారు.ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు జడల ప్రవీణ్, నామాని సురేష్, అసిస్టెంట్ సెక్రటరీ ధనిశెట్టి సురేష్, ఏరియా ఆర్గనైజర్ బాసబోయిన కుమారస్వామి, పిట్ సెక్రటరీలు నాగవెల్లి శ్రీధర్, పసునూటి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

