-తరగతి గదిలో తలరాతలు రాసే బ్రహ్మలారా.!
విశ్వానికి విజ్ఞానమందించే విశ్వ గురువులారా.!!
-కొవ్వతిలా కరుగుతూ కాంతిని విరజిమ్మే దివ్వెలారా! అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞాన వెలుగులు నింపే ఆది గురువులారా.!! వందనం..మీకు పాదాభివందనం..!

మంచిర్యాల ప్రత్యక్షత:-ఎంతో పవిత్రమైన గౌరవప్రదమైన వృత్తి ఉపాధ్యాయ వృత్తి భావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఒక ఉపాధ్యాయుని పాత్ర ఎంతో కీలకమైంది. అటువంటి ఉపాధ్యాయున్నీ మనమందరం గౌరవించుకునే రోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవం.ఉపాధ్యాయ దినోత్సవాన్ని సెప్టెంబర్ 5 నే ఎందుకు జరుపుకుంటున్నాము..?మన తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా, ఉపాధ్యాయునిగా సేవలందించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ 5న తిరుత్తనిలో జన్మించారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దిన రాధాకృష్ణన్ ఎప్పుడూ తన జన్మదినాన్ని జరుపుకోలేదు. ఆయన స్నేహితులు, విద్యార్థులు ఎన్నోసార్లు ఆయన జన్మదినాన్ని జరుపుతామని అడిగితె.నా జన్మదినాన్ని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొమ్మని అన్నారు. అప్పటినుంచి 1962 సెప్టెంబర్ 5 నుండి సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినమును మనము ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాము.రాధాకృష్ణన్ కుటుంబం చాలా నిరుపేద కుటుంబము. తండ్రి వీరస్వామి చదివించే అంత స్తోమత లేదని కొడుకును పూజారి వృత్తి చేయమన్నాడు. కానీ చదువు అంటే ఎంతో ఇష్టం ఉన్నా రాధాకృష్ణన్ తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరాడు. అప్పటినుండి ఉపకార వేతనంతో తన చదువు అంతా కొనసాగించాడు. భోజనం చేసేందుకు అరిటాకులు కూడా కొనలేని పరిస్థితుల్లో నేలను శుభ్రం చేసుకుని ఆ నేలపైనే భోజనం చేసిన సందర్భాలెన్నో ఉన్నాయంట అంతా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆయన పట్టుదలను ఎప్పుడూ వదలలేదు. ఎన్నో ఒడిదుడుకులను ఓర్చుకొని గొప్ప ఉపాధ్యాయునిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఎదిగిన ఆయన వ్యక్తిత్వం మనందరికీ స్ఫూర్తిదాయకం. భారతీయ గురు శిష్య శక్తికి చక్కని ఉదాహరణలు: చాణిక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న అద్భుత శిల్పము_ చంద్రగుప్త మౌర్యుడు.సమర్థ రామదాసు తయారు చేసిన వీర ఖడ్గం చత్రపతి శివాజీ.రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక కీర్తి కిరీటం స్వామి వివేకానంద ఇలా ఎంతోమంది గొప్ప వ్యక్తులను తయారుచేసిన ఆ గురువుల కృషి మరువలేనిది.అమ్మ ఒడిలో నుండి అక్షరాలు నేర్చుకోవడానికి బడికి వచ్చిన ఒక విద్యార్థికి అక్షరాలు దిద్దించి, పాఠాలు నేర్పించి, మంచి చెడుల విచక్షణలను తెలిపి, మానవతా విలువలను నేర్పుతూ సమాజంలో తనకున్న నైతిక బాధ్యతలను గుర్తు చేస్తూ సమాజంలో ఉన్నత వ్యక్తిగా తీర్చిదిద్దే గురువులందరికీ నా పాదాభివందనాలు.

మిట్టపల్లి శ్యామల.
రచయిత, ప్రైవేట్ స్కూల్ టీచర్.