-ప్రతిభను ప్రోత్సహించే దిశగా ఘన సత్కార కార్యక్రమం

మంచిర్యాల ప్రత్యక్షత:-పవిత్ర మహా క్షేత్రమైన కాశీలో తెలుగు సంస్కృతి సాహితీ సేవా ట్రస్ట్, హానరరీ డాక్టర్ అవార్డు కౌన్సిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాహిత్యం, కళలు, విద్య, వైద్యం, సామాజిక సేవ తదితర రంగాల్లో విశేష కృషి చేసిన పలువురు ప్రతిభావంతులను జాతీయ పురస్కారాలతో సత్కరించారు. అదేవిధంగా తమ తమ రంగాల్లో అసాధారణ ప్రతిభను కనబరిచిన పలువురు ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశారు. పవిత్ర గంగా నది తీరంలోని కాశీ క్షేత్రంలో జరిగిన ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి విద్యావేత్తలు, కళాకారులు, సామాజిక సేవకులు, ఆహ్వానితులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారణాసి ఎంఎస్ఎంఈ మినిస్టర్ హంసరాజ్ విశ్వకర్మ, తామడ మోహనరావు శర్మ, ఆర్కిటెక్చర్ శిల్ప నిపుణుడు తాటికొండ ప్రసాద్, సామాజిక సేవా సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ ఉమాపతి పాల్గొని అవార్డులను ప్రదానం చేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం సమాజాభివృద్ధికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం ట్రస్ట్ నిర్వాహకులు డాక్టర్ మాచవరం గౌరీ శంకర్ మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సాహిత్యాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, ప్రతిభకు గౌరవం కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. కాశీ వంటి పవిత్ర వేదికపై ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అతిథులకు, అవార్డు గ్రహీతలకు, సహకరించిన ప్రతి ఒక్కరికీ ట్రస్ట్ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.


