
మంచిర్యాల ప్రత్యక్షత:-సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 1న నిర్వహించనున్న పెన్షన్ విద్రోహ దినాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. సోమవారం మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్లో జిల్లా సెక్రటరీ జనరల్ వనజారెడ్డి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాల ప్రతినిధులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ 1 నుంచి అమల్లో ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. సీపీఎస్ వల్ల ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత లేకుండా పోతుందని అన్నారు. పెండింగ్‌లో ఉన్న వేతన సవరణ సంఘం, ఉద్యోగుల ఆరోగ్య పథకం, కరువు భత్యాలు, రూ.12 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.వనజారెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అన్ని సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని, సెప్టెంబర్ 1న జరిగే నిరసనలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. మధ్యాహ్నం ఒంటి గంటకు నస్పూర్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం, బెల్లంపల్లి ఉప కలెక్టర్ కార్యాలయం, అన్ని తహసీల్దార్ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద నిరసనలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో శ్రీనివాసరావు దేశ్‌పాండే, బట్టారి వెంకటేశ్వర్లు, సుమిత్, పుప్పాల హనుమంతరావు, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గా ప్రసాద్, భూముల రామ్మోహన్, పత్తి సత్తయ్య, బొడ్డు శ్రావణ్‌కుమార్, సుధాకర్, సూరినేని గంగాధర్, ఒడిగ కృష్ణ, బి.రవీందర్, ఎస్.కిషన్, ఏ.సునీత, నాగుల గోపాల్, మోసిన్, సతీష్‌కుమార్, రాంకుమార్, ఎన్.సత్యనారాయణ, తిరుపతి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

