
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఆర్డీవో కార్యాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు.వేతన సవరణ అమలు, నూతన పింఛను విధానం రద్దు చేసి పాత పింఛను విధానం పునరుద్ధరణ, పెండింగ్‌లో ఉన్న ఆరు కరువు భత్యాల విడుదల, ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు, రూ.12 వేల కోట్ల బకాయిల చెల్లింపు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు 17 శాతం ఇంటి అద్దె భత్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 10 వరకు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని తెలిపారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ పరిపాలన అధికారి కే.రమేష్‌తో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

