
మంచిర్యాల ప్రత్యక్షత :-ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న ఉదయం 11 గంటలకు నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి జిల్లా నాయకులు తెలిపారు. మహా ధర్నాకు అనుమతి కోరుతూ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కే. వనజరెడ్డి జిల్లా కలెక్టర్, మంచిర్యాల సహాయ పోలీసు కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న డిమాండ్లను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

రాష్ట్ర నాయకత్వం తీసుకున్న నిర్ణయం, జిల్లాలోని అన్ని వర్గాల ఉద్యోగుల అభీష్టం మేరకు మహా ధర్నాను శాంతియుతంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, న్యాయమైన డిమాండ్లను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఉద్యోగుల సమస్యలను ప్రతిబింబించే ‘ఉద్యోగుల గొంతుక’ పత్రికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శ్రీనివాస్ దేశ్‌పాండే, అత్తె సుధాకర్, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, శ్రవణ్‌కుమార్, గోపాల్ రాంకుమార్, తిరుపతి, నడిమెట్ల సత్యనారాయణ, ఎండీ యూసఫ్, రాజేందర్, వసంత్ తదితరులు పాల్గొన్నారు.


