-సింగరేణిని దోచుకు తింటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
-కార్మికులకు అన్యాయం జరుగుతుంటే నోరు మెదపని కార్మిక మంత్రి వివేక్
-బిఆర్ఎస్ పార్టీ శాసనసభా ఉప పక్ష నేత, రాష్ట్ర మాజీ మంత్రి,సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-గతంలో దేశానికి ఆదర్శంగా నిలిచిన సింగరేణి నేడు కాంగ్రెస్ పాలనలో స్కాంలకు నిలయంగా మారిందని బిఆర్ఎస్ శాసనసభ ఉప పక్ష నేత, మాజీ రాష్ట్ర మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టిఆర్ఎస్ నేత తన్నీరు హరీష్ రావు ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతనపల్లి మున్సిపాలిటీలో కార్నర్ మీటింగ్లు నిర్వహించి, ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు రక్తాన్ని చెమటగా మార్చి, సింగరేణిని సిరుల బాట పట్టిస్తుంటే, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణిని దోచుకు తింటున్నాడని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ హయాంలో సింగరేణిలో కారుణ్య నియామకాల పేరుతో 16,500 మందికి డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తే, రేవంత్ రెడ్డి హయాంలో కారుణ్య నియామకాలను అటకెక్కించారని ఆరోపించారు.
స్కాములు చేస్తూ, సింగరేణి దోచుకుంటూ, కార్మిక వర్గాన్ని తీవ్ర అన్యాయం చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి నోరు మెదపడం లేదని ఆరోపించారు. గతంలో వారి తండ్రి సైతం కార్మిక మంత్రిగా పనిచేశారని, అయినప్పటికీ నేడు రాష్ట్ర కార్మిక మంత్రి వివేక్ స్పందించడం లేదని విమర్శించారు. తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని దోచుకు తినేందుకే కాంగ్రెస్ హయాంలో ఇంచార్జ్ సీఎండీ లతో పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని, ఆరు గ్యారెంటీలను, ఎన్నికల్లో హామీలను ప్రశ్నిస్తే, ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని, అక్రమ కేసులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను తీసుకురాకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనా అని ప్రశ్నించారు. అటువంటి కేసీఆర్ పై ముఖ్యమంత్రి మాట్లాడే భాష సరైనదేనా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి హయాంలో భూముల ధరలు పాతాళానికి పోగా, బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయని ఎద్దేవా చేశారు. రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కాంగ్రెస్ అవినీతిని, కుంభకోణాలను, గ్యారెంటీ ల గురించి అడిగితే రాష్ట్ర ముఖ్యమంత్రి వాటిని డైవర్షన్ చేస్తున్నాడని, ముఖ్యమంత్రి కుర్చీ నుండి ప్రజలు రేవంత్ రెడ్డిని డైవర్ట్ చేసే రోజులు దగ్గరలో ఉన్నాయని తెలిపారు.
రైతులకు పెట్టుబడి సాయం కింద కేసీఆర్ రైతుబంధు ఇస్తే, రేవంత్ రెడ్డి హయాంలో ఐదు సీజన్ లకు గాను రెండు రైతు బంధులు అందించి ,మూడు రైతుబంధులు ఎగ్గొట్టారని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ బదులు స్కాం క్యాలెండర్ అమలు చేస్తున్నారని, నెలకొక కుంభకోణంతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క సారి అవకాశం ఇస్తే, కాంగ్రెస్ నేతలు వారి ఆస్తులు పెంచుకుంటున్నారని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకపోగా, నెలకొక స్కాంలతో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రం బాగుపడాలంటే మరలా కెసిఆర్ ముఖ్యమంత్రి కావాలని పిలుపునిచ్చారు. 420 హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వచ్చేలా, ప్రతి ఎన్నికల్లో ప్రజలు బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కలవేణ శంకర్, మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ నేత నడిపెల్లి దివాకర్ రావు, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, బిఆర్ఎస్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, బిఆర్ఎస్, సిపిఐ కౌన్సిలర్ల అభ్యర్థులు, బిఆర్ఎస్, టీబీజీకేఎస్, సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.