-17న నిరసన కార్యక్రమాలు…18 నుండి సేవ్ సింగరేణి జాత
-30న జాత ముగింపు, హెడ్ఆఫీస్ ఎదుట ధర్నా, ఏప్రిల్ లో సమ్మె
-ఏఐటియుసి కేంద్ర కమిటీ కార్యదర్శి అక్బర్ ఆలీ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-సింగరేణి సమస్యలపై కార్మిక క్షేత్రంలోనే ప్రభుత్వాలను, సింగరేణి యాజమాన్యాన్ని నిలదీయాలన్న ఉద్దేశ్యంతోనే సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు, పోరాటాలు పిలుపునివ్వడం జరిగిందని యూనియన్ కేంద్ర కమిటీ కార్యదర్శి ఎండీ అక్బర్ ఆలీ తెలిపారు. సింగరేణి మందమర్రి ఏరియాలోని ఆర్కేపి సిహెచ్పి లో శుక్రవారం యూనియన్ ఆధ్వర్యంలో సేవ్ సింగరేణి జాత, ఏప్రిల్ లో నిర్వహించ తలపెట్టిన సమ్మె వాల్ పోస్టర్లను, కర పత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా అక్బర్ ఆలీ మాట్లాడుతూ, కార్మిక సమస్యల పరిష్కారానికి యూనియన్ ఆధ్వర్యంలో మార్చి 17న అన్ని గనులు, విభాగాలలో ధర్నాలు, నల్ల బ్యాడ్జీల ప్రదర్శనలు, మార్చి 18న శ్రీరాంపూర్లో సేవ్ సింగరేణి జాత ప్రారంభించి, అన్ని ఏరియాల కార్మికులను చైతన్య పరుస్తూ, మార్చి 30న జాతా ముగింపులో భాగంగా కొత్తగూడెం ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించడం జరుగుతుందని, అదేవిధంగా ఏప్రిల్ నెలలో తలపెట్టిన సమ్మెకు పిలుపునివ్వడం జరిగిందని, ఈ పోరాటాలలో, సమ్మెలో సింగరేణి కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయవలసిందిగా కోరారు. సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైందని కేసీఆర్ ప్రభుత్వం సింగరేణిని దోచుకుందని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అంతకంటే ఎక్కువగా దోపిడీ చేస్తూ, టెండర్లలో సైతం కమిషన్లు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపించారు. సింగరేణికి రావాల్సిన 51 వేలకోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని, స్ట్రక్చరల్ సమావేశాలలో ఒప్పుకున్న అంశాలపై ఉత్తర్వులు విడుదల చేయాలని, పెర్క్స్ పై ఐటీని సింగరేణి సంస్థనే భరించాలని, కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలని, సింగరేణిలో ఖాళీగా ఉన్న పోస్టులను ఇంటర్నల్ కార్మికులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు అందించాలని, తెలంగాణ లోని బొగ్గు బ్లాక్ లను, సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఉపాధ్యక్షుడు ఇప్పకాయల లింగయ్య, సిహెచ్పి పిట్ కార్యదర్శి హరి రామకృష్ణ, అసిస్టెంట్ పిట్ కార్యదర్శి మాదాసి వేణుగోపాల్, కమిటీ సభ్యులు కృష్ణస్వామి, మండల శ్రీనివాస్, కుంభం శ్రీనివాస్, వెంకటస్వామి, శ్రీకాంత్, రజిత, అనిత, మానస లు పాల్గొన్నారు.