-జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి

ప్రత్యక్షత : రేపటి భవిష్యత్తు కోసం బాలికలను కాపాడుకుందామని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి అన్నారు. జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నస్పూర్లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా మహిళ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భేటి బచావో- భేటి పడావో దశాబ్ది ఉత్సవాలలో జిల్లా సంక్షేమాధికారి రౌఫ్ ఖాన్, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి పురుషోత్తం నాయక్ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ బాలిక రక్షణ కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన భేటీ బచావో – భేటీ పడావో కార్యక్రమం 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఆడపిల్లలను బతికించుకుందామని, వారిని చదివించుకుని వారి హక్కులను కాపాడుకుందాం అని, బాలికలను స్వేచ్ఛగా ఎదగనిద్దామని అన్నారు. విద్యార్థినులు చదువుపై దృష్టి సారించాలని, ఎన్ని ఆటంకాలు వచ్చిన ఎంచుకున్న లక్ష్యం వైపుగా నడవాలని తెలిపారు. బాలికల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు తెలుసుకోవాలని తెలిపారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించి, భేటి బచావో- భేటి పడావో సంబంధిత గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. భేటి బచావో – భేటి పడావో కార్యక్రమంపై అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. జిల్లాలో భేటీ బచావో – భేటీ పడావో కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని, పాఠశాలలు, కళాశాలలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిసిడిఓ బాలల పరిరక్షణ సమితి అధికారి ఆనంద్, సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు, విద్యార్థినులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.