-గిరిజన పోరాట చరిత్రను పాటలుగా తరతరాలకు చేరవేయాలి : మంత్రి సీతక్క

జైపూర్ ప్రత్యక్షత:-గిరిజనుల ఆత్మగౌరవం, పోరాట చరిత్రకు ప్రతీకలైన సమ్మక్క–సారక్కల గాథలను పాటల రూపంలో ప్రజల్లోకి తీసుకువచ్చే ప్రయత్నంగా ‘సమ్మక్క–సారక్క–2’ భక్తి గీతాల ఆల్బమ్‌ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మేడారం సమ్మక్క–సారక్క సన్నిధిలో విడుదల చేశారు.వందల ఏళ్ల క్రితమే సామంత దోపిడీకి ఎదురొడ్డి పోరాడిన వీర వనితలు సమ్మక్క–సారక్కల త్యాగాన్ని నేటి తరానికి గుర్తుచేయడంలో ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి సీతక్క అన్నారు. గిరిజనుల చరిత్ర, సంస్కృతి, జీవన విధానాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె పేర్కొన్నారు.
పొట్టాల నాగరాజు రచించిన ఈ ఆల్బమ్‌లో “జారు జారు బండల్లో జంపన్న వాగులో”, “కోయదేవార కొండదేవారా”అనే రెండు పాటలు గిరిజన ప్రజల జీవన పోరాటాన్ని, ప్రకృతితో వారి అనుబంధాన్ని ప్రతిబింబిస్తున్నాయని కొనియాడారు. పాటల రచయిత నాగరాజు ని మంత్రి సీతక్క అభినందిస్తూ గిరిజన చైతన్యాన్ని పెంపొందించే సాహిత్య–సాంస్కృతిక కృషి మరింత విస్తరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సీఈపీ ఇంజనీర్, ట్రైబల్ వెల్ఫేర్ రిటైర్డ్ అధికారి (హైదరాబాద్) ముడిమగుల శంకర్, నేతకాని మహార్ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు యేసుకురి రాజమల్లు, మాజీ అధ్యక్షులు దుర్గం గోపాల్, ములుగు జిల్లా అధ్యక్షులు జాడి రాంబాబు, గాయకుడు దూట రాజసమ్మయ్య, పొట్టాల చందు, దుర్గం సమ్మయ్య (వరంగల్), సల్లూరి ఎల్లయ్య (ఏటూర్ నాగారం) తదితరులు పాల్గొన్నారు.గిరిజనుల పోరాట వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చే ఇలాంటి కార్యక్రమాలకు ప్రజా సంఘాలు, సాంస్కృతిక కార్యకర్తలు మద్దతు ఇవ్వాలని వక్తలు పిలుపునిచ్చారు.