-పుర వీధుల్లో విస్తృతంగా ప్రచారం..!పోలింగ్ కు సర్వం సిద్ధం

మంచిర్యాల ప్రత్యక్షత:-రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రచార పర్వానికి తెర పడింది. గత వారం పది రోజులుగా అభ్యర్థులు తమను గెలిపించాల్సిందిగా తమ తమ వార్డులలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. నేటితో ప్రచార పర్వానికి తెరపడటంతో గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో 14 పోలింగ్ కేంద్రాలు, 45 పోలింగ్ బూత్ లను ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేశారు. సుమారు 150 మంది పోలీసులతో పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తును నిర్వహిస్తున్నారు. ప్రచారపర్వం ముగియడంతో మున్సిపాలిటీలో 163 బిఎన్ఎస్ఎస్ అమలు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు తెలిపారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్, మందమర్రి సిఐ పర్సా రమేష్, రామకృష్ణాపూర్ ఎస్ఐ శ్రీధర్, మందమర్రి ఎస్ఐ గోపతి నరేష్, సర్కిల్ పరిధిలోని ఎస్ఐ లు, పోలీస్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికలు సజావుగా సాగేందుకు పలు సలహాలు, సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసిపి ఏ రవికుమార్ మాట్లాడుతూ, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు నిర్వహిస్తుందని తెలిపారు.

పట్టణంలోని పలు వార్డులలో రాష్ట్ర మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి విస్తృతంగా ప్రచారం నిర్వహించి, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి, పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అదేవిధంగా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య లు పట్టణంలోని పలు వార్డులలో విస్తృతంగా పర్యటించి, బిఆర్ఎస్, సిపిఐ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. హోరాహోరి గా సాగుతున్న పుర పోరులో ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ లో ఎవరు విజయ బావుటా ఎగురవేసి, మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంటారో, ప్రజా తీర్పు ఎలా ఉంటుందో వేచి చూడాలి.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి