
కరీంనగర్ ప్రత్యక్షత:-నగరంలోని పలు ప్రాంతాల్లో చెత్త కుప్పలు పేరుకుపోవడంతో ప్రజలు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పక్కన, ఫుట్‌పాత్‌లపై చెత్త సంచులు, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఆకులు, ఇతర చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.ప్రధాన రహదారుల వెంట చెత్త పేరుకుపోవడంతో పాదచారులు ఫుట్‌పాత్‌లను వినియోగించుకోలేక రోడ్డుపైనే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వాహనాల రాకపోకల మధ్య ప్రమాదాల భయం నెలకొంది. మరోవైపు చెత్తను సకాలంలో తొలగించకపోవడంతో చెత్త కుప్పల వద్ద కోతులు సంచరిస్తూ చెత్త సంచులను చిందరవందర చేస్తున్నాయి. దీంతో వ్యర్థాలు రోడ్డుపైకి చేరి పరిసరాల్లో మరింత అపరిశుభ్రత ఏర్పడుతోంది.వర్షాలు కురిసే సమయంలో చెత్తలో నీరు నిలిచి దుర్వాసన, దోమల బెడదతో పాటు పారిశుధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్రైనేజీల్లో చెత్త చేరకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.చెత్తను రోడ్లపై వేయకుండా ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు, చెత్త సేకరణను క్రమబద్ధీకరించాలని స్థానికులు కోరుతున్నారు. చెత్త కుప్పలను వెంటనే తొలగించి, ఫుట్‌పాత్‌లు, రోడ్డు పరిసరాలను నిరంతరం శుభ్రంగా ఉంచాలని మున్సిపల్ అధికారులను స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

