-రాక్షసానందం పొందుతున్న కాంగ్రెస్ పెద్దలు
-బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:- జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల ఎన్నికలు నిర్వహించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వివేక్ అడ్డుకుంటున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. ఆదేశాల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం అయినా హాజరై, సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో సుమన్ మాట్లాడుతూ,ఆనాడు క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు 25 మందిపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించడం కాకుండా, బెయిల్ పై విడుదల అయిన వారిని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కాంగ్రెస్ పెద్దలు రాక్షసానందం పొందుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర హైకోర్టు మూడు వారాల్లో క్యాతనపల్లి ఎన్నికలు నిర్వహించాలని సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటిస్తూ, పంపించవలసిన రాష్ట్ర ప్రభుత్వ సమ్మతిని పంపించకుండా, కాలయాపన చేస్తుందని విమర్శించారు. దీనిపై త్వరలోనే కోర్టు ధిక్కారం చేస్తున్నారని హైకోర్టును మరల ఆశ్రయించడం జరుగుతుందని తెలిపారు. ఈ అంశంపై రాష్ట్ర గవర్నర్ తో సైతం సమావేశం కావాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారని, అదే విధంగా రాష్ట్ర శాసనసభ, శాసన మండలి లో సైతం రాష్ట్రంలోని ఇబ్రాహీం పట్నం, క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం జరుగుతుందన్నారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను ప్రజలు బిఆర్ఎస్ – సీపీఐ కూటమికి 14 వార్డులో పట్టం కట్టగా, అధికార కాంగ్రెస్ పార్టీ 7 వార్డులకు మాత్రమే పరిమితమయ్యారని, అయినప్పటికీ మంత్రి వివేక్ అధికార బలంతో మున్సిపల్ పీఠాన్ని చేజిక్కించుకున్నెందుకు ఫిబ్రవరి 16న కౌన్సిలర్లు కౌన్సిల్ హాలుకు పోకుండా అడ్డుకోవడం తోపాటు ఫిబ్రవరి 17న కౌన్సిల్ హాల్లో గొడవ చేశారని, తమపై రాళ్లు రువ్వి, పోలీసులచే లాఠీ చార్జ్ నిర్వహించి, తమపైనే అన్యాయంగా అక్రమ కేసులు బనాయించి, జైలలో నిర్బంధించి, బెయిల్ పై విడుదల అయిన అనంతరం సైతం పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా క్యాతనపల్లి ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రి వివేక్ గుర్తించాలని సూచించారు. గత నెల రోజులకు పైగా గెలిచిన తమ కౌన్సిలర్లు తమ కుటుంబాలకు, వార్డు ప్రజలకు దూరంగా ఉండే దుస్థితిని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నటించడం మానేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు తమ సమ్మతిని తెలుపుతూ ఫైల్ పంపించాలని హితవు పలికారు. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ల ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి వివేక్, క్యాతనపల్లి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాల తో పాటు తమ పార్టీ నాయకులను, కౌన్సిలర్ లను, వారి కుటుంబాలను సైతం ఇబ్బందుల గురిచేసిందని, ఇప్పటికైనా వారి ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో తప్పకుండా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి చైర్ పర్సన్ గా, సిపిఐ పార్టీ అభ్యర్థి వైస్ చైర్మన్ గా ఎన్నిక కావడం తధ్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.