-చైర్ పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి(బిఆర్ఎస్)
-వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి సరిత(సిపిఐ) లు బాధ్యతలు స్వీకరణ

రామకృష్ణాపూర్ ప్రత్యక్షత:-తీవ్ర నాటకీయ పరిణాల అనంతరం సుమారు 55 రోజుల తర్వాత ఎట్టకేలకు జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలకవర్గం కొలువుదీరింది. మున్సిపల్ చైర్ పర్సన్ గా గొడిసెల సంధ్యారాణి రాజా రమేష్(బిఆర్ఎస్), వైస్ చైర్ పర్సన్ గా మిట్టపల్లి సరిత శ్రీనివాస్(సిపిఐ) లు సోమవారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. బిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు ర్యాలీగా వెళ్లి ముందుగా పట్టణంలోని రామాలయం, అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం రామాలయం చౌరస్తాలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు. అక్కడి నుండి ర్యాలీగా సూపర్ బజార్ చౌరస్తాలో గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలు వేసి, జయశంకర్ చౌరస్తా వద్ద గల జయశంకర్ విగ్రహానికి, పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు, ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్, కేసిఆర్ చిత్రపటాలను చేత బట్టి పట్టణ మున్సిపల్ కార్యాలయానికి చేరుకొని, కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు దస్త్రాలపై అధికారిక సంతకాలు చేసి, బాధ్యతలు స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం వారికి క్యాతనపల్లి మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ పుష్పగుచ్చం అందించి, శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా బిఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు,నాయకులు, కార్యకర్తలు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ గొడిసెల సంధ్యారాణి, వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత లు మాట్లాడుతూ, క్యాతనపల్లి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. సమర్థవంతమైన పనితీరుతో మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలుపుతామని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామన్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చి దిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్, సిపిఐ వార్డు కౌన్సిలర్లు,బిఆర్ఎస్ నాయకుడు డాక్టర్ రాజా రమేష్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, బిఆర్ఎస్, సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.