
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల ఐక్య కార్యాచరణ సమితి మంచిర్యాల జిల్లా సమావేశం డిమాండ్ చేసింది. మంచిర్యాలలోని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సమావేశ మందిరంలో జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పెండింగ్‌లో ఉన్న ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వం పరిష్కరించాల్సిన ప్రధాన డిమాండ్లపై చర్చించారు. రెండో వేతన సవరణ సంఘాన్ని వెంటనే అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఆరు విడతల కరువు భత్యాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు.

ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన ఆరోగ్య పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న అన్ని బిల్లుల చెల్లింపుల కోసం ప్రతి నెల రూ.2 వేల కోట్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భాగస్వామ్య పింఛను పథకం సమస్యకు పరిష్కారం చూపి ఉద్యోగులకు న్యాయం చేయాలని కోరారు.రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలు, అసోసియేషన్లకు తగిన గుర్తింపు కల్పించి, వారి సమస్యలను అధికారికంగా పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సమావేశం నిర్ణయించింది. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అన్ని సంఘాలు ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో వనజారెడ్డి, పర్వతి సత్యనారాయణ, శ్రీనివాసరావు దేశ్‌పాండే, బట్టరీ వెంకటేశ్వర్, సుమిత్, పుప్పాల హనుమంతరావు, శ్రీపతి బాపురావు, పొన్న మల్లయ్య, దుర్గాప్రసాద్, భూముల రామ్మోహన్, బొడ్డు శ్రావణ్‌కుమార్, సుధాకర్, పత్తి సత్తయ్య, సూరినేని గంగాధర్, బి. రవీందర్, ఎస్. కిషన్, ఏ. సునీత, నాగుల గోపాల్, రాంకుమార్, సత్యనారాయణ, తిరుపతి, వెంకటేష్, ఏ. రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

