-డిమాండ్లు పరిష్కరించకుంటే ఉద్యమం ఉధృతం

మంచిర్యాల ప్రత్యక్షత:- ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం నస్పూర్ జిల్లా సమీకృత సముదాయ కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించారు. జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా సుమారు 4,500 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు హాజరయ్యారు.జిల్లా సమీకృత సముదాయ కార్యాలయ ముఖద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించి, అనంతరం కార్యాలయం ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు అందజేశారు.ఈ సందర్భంగా గడియారం శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగులకు రెండో పీఆర్సీని వెంటనే అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఆరు విడతల డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లకు ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ప్రతి నెల రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని కోరారు. సీపీఎస్ సమస్యను పరిష్కరించి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఉద్యోగ సంఘాలకు తగిన గుర్తింపు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.వనజా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని అన్నారు. సమస్యలు పరిష్కరించకుంటే సంఘాలతో సమన్వయం చేసుకుని తదుపరి కార్యాచరణ ప్రకటించి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ నాయకులు, టీజీవో, టీఎన్జీవో ప్రతినిధులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల నాయకులు పాల్గొన్నారు.


