
మంచిర్యాల ప్రత్యక్షత:-ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సెప్టెంబర్ 10న నిర్వహించనున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీజీఈజేఏసీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి పిలుపునిచ్చారు. చలో హైదరాబాద్ కార్యక్రమం సన్నాహాల్లో భాగంగా మంచిర్యాలలోని టీఎన్జీవో భవన్‌లో జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీహరి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమానికి జిల్లా నుంచి పెద్దఎత్తున ఉద్యోగులు తరలిరావాలని కోరారు. మంచిర్యాల జిల్లా నుంచి కనీసం 5 వేల మందికి తగ్గకుండా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు పాల్గొని చలో హైదరాబాద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం చలో హైదరాబాద్ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కో-చైర్మన్లు పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, డిప్యూటీ సెక్రటరీ జనరల్ బొడ్డు శ్రావణ్ కుమార్, అత్తే సుధాకర్, వైస్ చైర్మన్లు సూరినేని గంగాధర్, నాగుల గోపాల్, సెక్రటరీలు నడిమెట్ల సత్యనారాయణ, తంగళ్లపల్లి తిరుపతి, ఎస్. ప్రభు, టీజీవో, టీఎన్జీవో నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

